కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నిన్న రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు చెందిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు ఇష్టం ఉంటే అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తాము టీఆర్ఎస్ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. దీనిపైనే కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ లో స్పందించారు.

 

‘‘అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం తన సొంత పార్లమెంట్ సీటు అమేథీలో గెలవలేకపోయారు. అటువంటి నేత ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ జీ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్న వ్యక్తి మొదట తనను ప్రజలు ఎంపీగా గెలిపించేలా చేసుకోవాలి’’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ గాంధీ నిన్న అన్నారు. దేశంలో జరిగే 2024 ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని చెప్పారు. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉంటాయన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!