ఓటీటీలోకి వచ్చేసిన ‘మేజర్​’ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…

సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి యువ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకొని సినిమాలు చేస్తున్న శేష్ నిర్మాతలకు లాభాలు, ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు. అతను  హీరోగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ముంబై  దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 
 ఇందులో ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించాడు. బాలీవుడ్ యువ నటి సయీ మంజ్రేకర్  హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలలో కనిపించారు. సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. జూన్ 3వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఉన్ని కృష్ణన్ పాత్రలో శేష్ లీనమైపోయి నటించిన ఈ చిత్రం సగటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. దాంతో, శేష్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటుడు అయిపోయాడు. 
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో ఈ చిత్రం ఆదివారం నుంచి స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లో విడుదలైన సరిగ్గా నెల రోజుల్లో ‘మేజర్’ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయడం విశేషం. నెట్ ఫ్లిక్స్‌ లో తెలుగు, మలయాళంతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో  సినిమా చూడని ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లోనే చూసేందుకు అవకాశం లభించింది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఓటీటీలోనూ ‘మేజర్’కు మంచి రెస్పాన్స్ రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా, అడివి శేష్  ప్రస్తుతం ‘హిట్’ చిత్రం సీక్వెల్లో నటిస్తున్నాడు.
Nationalist Voice

About Author

error: Content is protected !!