ఏమైనా చేసుకోండి… కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగి తీరుతుంది: నాదెండ్ల

సీఎం సొంత జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం అనేకమంది అన్నదాతలు బలవన్మరణం చెందారని వివరించారు. హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల ఇవాళ కడప జిల్లా జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కడప జిల్లాలో గత మూడేళ్ల కాలంలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. 
బెదిరింపులకు పాల్పడినా, కేసులు పెట్టినా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర జరిగి తీరుతుందని ఉద్ఘాటించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన నుంచి రూ.1 లక్ష ఇస్తున్నామని, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.7 లక్షల అందేవరకు జనసైనికులు పోరాడాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 

కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టబోయే యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుందని ధీమాగా చెప్పారు. దసరా నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని మార్పులు ఉంటాయని ఉద్ఘాటించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు కంకణం కట్టుకుని పనిచేయాలని కర్తవ్యబోధ చేశారు. కేసులు, అరెస్టులు, బెదిరింపులు, దాడులకు వెనుకంజ వేయొద్దని అన్నారు. 

కడప జిల్లాలో జనసేన ఎంతగా బలంగా ఉందో కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా చాటిచెబుదామని నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ ఏ విషయంలో అయినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, కచ్చితంగా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది అయితేనే దాన్ని ఆమోదిస్తారని నాదెండ్ల వివరించారు. ప్రతి జనసైనికుడు పవన్ మార్గంలో నడవాలని సూచించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!