ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్యం అత్యంత విషమం.. కాపాడేందుకు వైద్యుల ప్రయత్నం

  • కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భగీరథరెడ్డి
  • విపరీతమైన దగ్గుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
  • ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతోందన్న వైద్యులు
ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు ఆయన బంధువు చల్లా రఘునాథరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో బాధపడ్డారు. దీంతో వెంటనే ఆయనను నంద్యాల జిల్లా అవుకులోని తన ఇంటి నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు.

ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండడంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. భగీరథరెడ్డికి వైద్యులు తొలుత వెంటిలేటర్‌పై 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ఇప్పుడు దానిని 60 శాతానికి తగ్గించినట్టు రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తున్నట్టు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.

చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఆయన రెండో కుమారుడైన భగీరథరెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. కాగా, భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!