ఆస్తి కోసం చిత్రహింసలు…భరించలేక వివాహిత ఆత్మహత్య…!

హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్తి కోసం భర్త పెట్టే చిత్రహింసలు రోజురోజుకు ఎక్కువవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఒక్కగానొక్క కుమార్తె ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్, నాగలక్ష్మిలకు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి సందర్భంగా నాగలక్ష్మి కుటుంబ సభ్యులు 30 తులాల బంగారం, నగదు, ఇతరత్రా కానుకలు కట్నంగా సమర్పించారు. శ్రీకాంత్ వృత్తి రీత్యా వివాహ అనంతరం ఈ జంట హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. 

కొద్దిరోజులుగా శ్రీకాంత్ నాగలక్ష్మిని అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. నాగలక్ష్మి తల్లిదండ్రులకు నల్గొండలో ఉన్న రూ.1 కోటి విలువ చేసే భవనాన్ని తన పేరిట రాయించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. నాగలక్ష్మి వ్యతిరేకించడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో శనివారం (జూలై 29) నాగలక్ష్మి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ సమయంలో కుమారుడు స్కూల్‌కు వెళ్లగా, నాగలక్ష్మి భర్త శ్రీకాంత్ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఒక్కగానొక్క కుమార్తె ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Nationalist Voice

About Author

error: Content is protected !!