ఆస్తి కోసం అత్యాచారం చేశారని మహిళ నాటకం.. చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు

  • వైద్య పరీక్షలలో బయటపడిన నాటకం
  • మహిళ స్నేహితులనూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కఠినంగా శిక్షించాలని సూచించిన మహిళా కమిషన్
న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ మహిళ ప్లాన్ వేసింది.. తనపై సామూహికంగా అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మహిళా కమిషన్ కూడా స్పందించింది. బాధితురాలికి న్యాయం చేయాలని లేఖ రాయడంతో పోలీసులు పరుగులు పెట్టారు. తీరా విచారణలో ఆ మహిళ చెప్పిందంతా బూటకమని, అసలు ఆమె అత్యాచారమే జరగలేదని తేలడంతో అధికారులు నివ్వెరపోయారు. ఆస్తి కోసం సదరు మహిళే ప్లాన్ చేసి అత్యాచారం జరిగిందంటూ నాటకమాడిందని బయటపడింది. దీంతో సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద పెట్టి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జడ్జి వారికి 14 రోజుల కస్టడీకి ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..
ఘజియాబాద్ కు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి, సామూహికంగా తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ నేరస్థుల కోసం వెతికారు. బాధితురాలు చెప్పిన నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లేమీ కనిపించలేదని వైద్యులు తేల్చారు. దీనిపై మరింత లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని దక్కించుకోవడం కోసం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచార నాటకమాడినట్లు సదరు మహిళ వెల్లడించింది. అసలు విషయం బయటపడడంతో పోలీసులను తప్పుదోవ పట్టించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలంటూ మహిళా కమిషన్ లేఖ రాసింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!