ఆర్థిక సంక్షోభం ముంగిట 69 దేశాలు

ఆర్థిక నిపుణులు సామాజిక శాస్త్రవేత్తలు అంతా ఊహించినట్టే జరుగుతోంది. దేశాలకు దేశాలే ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. మరోసారి ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని ఇంకా ప్రపంచ దేశాలు అప్పుడే మర్చిపోలేదు. మళ్లీ ఇంతలోనే మరోమారు ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతోందనే ఆర్థిక నిపుణుల హెచ్చరికలు అందరిలోనూ ఆందోళన పెంచుతున్నాయి. అందులోనూ ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయనే వార్త అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సాధారణంగానే ఆ దేశాల్లో అస్తవ్యస్త పాలన స్థిరత్వం లేని ప్రభుత్వాలు సైనిక జోక్యాలు విపరీతమైన అవినీతి ఎక్కువ. ఇప్పుడు వీటికి పులి మీద పుట్రలా గత రెండేళ్లుగా కోవిడ్ సృష్టించిన సంక్షోభం ప్రస్తుత ఉక్రెయిన్ – రష్యా యుద్ధం దాపురించాయి. దీంతో ఇంధన ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. డాలర్లు అడుగంటడం లెక్కకు మిక్కలి అప్పులు తీవ్ర నిరుద్యోగం ఆర్థిక వృద్ధి మందగమనం అధిక ద్రవ్యోల్బణం లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాల పుట్టి ముంచుతోంది. దాదాపు ఇవే కారణాలతో మన పొరుగు ద్వీప దేశం శ్రీలంక ఆర్థికంగా తీవ్రంగా పతనమైంది. ప్రజల నిరసనలు తట్టుకోలేక ప్రతి రోజూ ఆ దేశంలో కర్ఫ్యూ విధిస్తున్నారు. నిత్యావసరాలు మందుల కొరతతో ప్రజలు అలమటిస్తున్నారు. ఇంధన ధరలు ఆకాశంతో పోటీ పడుతున్నాయి. చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్న లంక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం భారత్ వైపు దీనంగా చూస్తోంది. ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు కూడా శ్రీలంక మాదిరిగానే ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 69 దేశాల్లో శ్రీలంకలో ఉన్న పరిస్థితులే ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఎప్పుడో ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో చమురు ధరలు వంట నూనెల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగాయి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు పావు శాతం అంటే 25 శాతం రష్యానే తీరుస్తోంది. అలాగే వనస్పతి నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్ ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెలను ఎగుమతి చేయడానికి ఉక్రెయిన్ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. అలాగే తమ మాట పెడచెవిన పెట్టి ఉక్రెయిన్పై కాలు దువ్విన రష్యాపై అమెరికా – బ్రిటన్ – జర్మనీ – కెనడా – ఫ్రాన్స్ – జపాన్ – దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ఎవరూ చమురు కొనకూడదని హెచ్చరించాయి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ ప్రభావమంతా ప్రపంచంలోని పేద దేశాల మీదే పడుతోంది. ఆ పేద దేశాలు ఏవంటే ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలే. ఈ మేరకు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టడానికి ముందే ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. 69 అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు తెలిపింది. 11 వందల కోట్ల డాలర్ల మేర ఆయా దేశాలు అప్పు పడినట్టు వెల్లడించింది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం వైపుకు నెడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. భారీగా చమురు ఆహార కొరత నెలకొంది. ఫలితంగా లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాలపై భారీ దెబ్బ పడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో 107 దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నట్టు 2022 మార్చిలోనే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఆహార కొరత ఇంధన ధరల పెరుగుదల ఆర్థిక కష్టాలు మొదలవుతాయని వెల్లడించింది. ఆయా దేశాల్లో 170 కోట్ల మంది ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడతారని బాంబు పేల్చింది. ఆర్థిక మాంద్యం బారినపడే 69 దేశాల్లో 25 ఆఫ్రికా దేశాలు ఉండగా మరో 25 ఆసియా పసిఫిక్ దేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 19 లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం కష్టాలను ఎదుర్కోబోయే మొదటి దేశం ఈజిప్టు అని ఐక్యరాజ్యసమితి నివేదించింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాల నుంచి భారీ మొత్తంలో ఈజిప్టు గోధుమలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో ఆ దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. అలాగే ట్యునీషియా – లెబనాన్ – అర్జెంటీనా – ఎల్ సాల్వడార్ – పెరూ వంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి.  ఇక ఆఫ్రికా దేశాల్లో.. ఘనా – ఇథియోపియా – కెన్యా – దక్షిణాఫ్రికాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆసియా – ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న టర్కీ కూడా ఆర్థిక పతనం దిశగా సాగుతోంది. ఈ 69 దేశాలు కాకుండా వచ్చే ఏడాది కాలంలో మరో 12కు పైగా దేశాల్లో శ్రీలంక పరిస్థితులు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారత్ పొరుగునే ఉన్న పాకిస్థాన్ – మయన్మార్ – నేపాల్లోనూ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. చైనా రుణ ఊబిలో చిక్కుకున్న ఈ దేశాలు ఆ అప్పులు కట్టలేక దివాలా స్థితికి చేరుకున్నాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!