ఆన్‌లైన్‌ ఆట.. ప్రాణాలతో చెలగాటం…

  • జూదమాడి లక్షలు పోగొట్టుకుంటున్న యువత
  • మనస్తాపంతో బలవన్మరణాలు
  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నేరం..
  • ఆరు నెలల జైలు శిక్ష

కష్టపడకుండా కూర్చున్నచోటు నుంచే లక్షలు సంపాదించాన్న ధోరణి యువతలో పెరుగుతున్నది. దీంతో ఎందరో ఆన్‌లైన్‌ రమ్మీ, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడుతున్నారు. తీరా ఆ ఉచ్చులో చిక్కి, బయటపడలేక అందినకాడికి అప్పులు చేసి చివరికి ప్రాణాలు తీసుకొంటున్నారు. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు రూ.70 లక్షలు ఆన్‌లైన్‌ రమ్మీలో పొగొట్టుకుని చివరకు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై తెలంగాణలో నిషేధం ఉండటంతో కొన్ని సాఫ్ట్‌వేర్లను వాడి యువత ఫేక్‌ జీపీఎస్‌తో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నట్టు పోలీసులు తెలిపారు. అలా ఆడి మోసపోతే మన రాష్ట్రంలో కేసు నమోదు చేయటం కష్టమని చెప్తున్నారు.

డబ్బులు తిరిగి రావు.. పైగా కేసు!
తెలంగాణలో జూదం, పేకాటను బయటే కాదు ఆన్‌లైన్‌లో ఆడటం కూడా తెలంగాణ గేమింగ్‌ (సవరణ) చట్టం-2017 ప్రకారం నేరమే. ఆన్‌లైన్‌లో నిర్వహించే జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్ర సర్కారు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాదని ఆడితే ఆరు నెలల వరకు జైలుశిక్ష పడుతుంది. జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి నష్టపోతే.. ఆడినవారు చట్టప్రకారం దోషులే కాబట్టి బయటికి చెప్పే పరిస్థితి ఉండదు. చివరకు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందలేం. బయటికి చెప్తే పరువు పోవటంతోపాటు జైలు పాలు కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనంతో ప్రాణాలు తీసుకొంటున్న ఘటనలు ఇవీ..
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన మహేశ్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో డబ్బు పోగొట్టుకుని రూ.7 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో 2020 సెప్టెంబర్‌ 3న ఉరేసుకొన్నాడు.
మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌వేర్‌ ఇంజినీర్‌ లాక్‌డౌన్‌ (2020) సమయంలో వర్క్‌ఫ్రం హోం చేస్తూ ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటుపడ్డాడు. ఇలా మొత్తం రూ.50 లక్షలు పోగొట్టుకుని చివరికి మతిస్థిమితం కోల్పోయాడు.
ఆదిలాబాద్‌ కు చెందిన ఓ యువకుడు ఎంఎస్‌ కోసం లండన్‌ వెళ్లటానికి 20 21లో హైదరాబాద్‌ వచ్చాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్‌కు బానిసై రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. చివరకు ఏం చేయాలో పాలుపోక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన మధురెడ్డి అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడి రూ.1.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. మనస్తాపంతో 2021 జూలై 15న ఆత్మహత్య చేసుకొన్నాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!