అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం షాక్‌!

అసెంబ్లీ సీట్ల పెంపున‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాల‌కు షాక్ ఇచ్చింది. ఏపీ విభ‌జ‌న చ‌ట్టం హామీ ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో వుంది. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ స‌మాధానం ఇచ్చారు.

అలాంటి ఆలోచ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ఒక‌వేళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సి వుంటుంద‌న్నారు. 2026 జ‌న‌గ‌ణ‌న లెక్క‌ల ప్ర‌కారం అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల ఉంటుంద‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగంలోని 170 ప్ర‌కారం సీట్ల పెంపు వుండ‌ద‌న్నారు. దీంతో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని, పోటీ చేయ‌వ‌చ్చ‌నే వారి ఆశ‌ల‌పై  కేంద్రం నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది.  

ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని హామీ ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి వుంది. ఏపీలో 175 నుంచి 225 స్థానాలు, అలాగే తెలంగాణ‌లో 119 నుంచి 153కు పెంచుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు చేయ‌డానికి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌పై పార్ల‌మెంట్‌లో బిల్లు ఆమోదిస్తార‌ని కూడా అంద‌రూ భావించారు.  

అయితే  తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా బీజేపీకి అనుకూల ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ వుంది. తెలుగు రాష్ట్రాల‌కు ఏమీ చేయ‌క‌పోయినా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేదు. 

క‌నీసం తెలంగాణ‌లో టీఆర్ఎస్ నేత‌లు అంతోఇంతో బీజేపీతో ఢీకొంటున్నారు. ఏపీలో అదీ లేదు. అందుకే చ‌ట్ట‌బ‌ద్ధంగా తెలుగు రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన‌వి కూడా  ఇవ్వ‌కుండా కేంద్రం మొండిచేయి చూపుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

Nationalist Voice

About Author

error: Content is protected !!