అమరావతి రైతుల యాత్రను అడ్డుకున్న పోలీసులు… రైతులపై చేయి చేసుకున్న వైనం

  • కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • పసలపూడి వద్ద యాత్రను అడ్డుకున్న పోలీసులు
  • ఐడీ కార్లులు చూపించి ముందుకు కదలాలని ఆదేశం
  • పోలీసులు, రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం
  • ఐకాస నేతలను ఈడ్చి పడేసిన పోలీసులు
  • తలకు గాయంతో సొమ్మసిల్లిపడిపోయిన మహిళా రైతు
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పసలపూడి గ్రామానికి యాత్ర చేరుకోగానే… రైతులను పోలీసులు నిలిపివేశారు.  ఐడీ కార్డులు చూపిస్తే గానీ యాత్రకు అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నేతలు, పోలీసుల మధ్య చాలా సేపే వాగ్వాదం చోటుచేసుకుంది.

హైకోర్టు అనుమతులతోనే యాత్ర చేస్తున్నామని రైతులు చెప్పినా పోలీసులు వినిపించుకోేలేదు. ఈ సందర్భంగా ముందుకు కదిలేందుకు రైతులు యత్నించగా… పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడ మోహరించిన ఉన్నతాధికారులు… రైతులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో రైతులపై పోలీసులు చేయి చేసుకున్నట్లుగా పలు టీవీ ఛానెళ్లు విజువల్స్ చూపించాయి. తమతో వాదించేందుకు యత్నించిన ఐకాస నేతలను పోలీసులు ఈడ్చి పడేశారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు తలకు గాయం కాగా… ఆమె అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. మొత్తంగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!