అన్న కోసం పదవిని త్యాగం చేసిన గంగూలీ

  • క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న గంగూలీ
  • తన అన్న స్నేహాశిష్ గంగూలీ కోసం పోటీకి దూరమైన వైనం
  • కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే పోటీ చేయలేదన్ని గంగూలీ
రెండోసారి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలనుకున్న సౌరవ్ గంగూలీకి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా పోటీ చేసి, బీసీసీఐలో చక్రం తిప్పాలని గంగూలీ భావించాడు. అక్టోబర్ 22న నామినేషన్ వేస్తానని కూడా ప్రకటించాడు. అయితే, ఆయన క్యాబ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నాడు. ఆదివారం నామినేషన్ తుడి గడువు ముగిసింది. అయినా ఆయన నామినేషన్ వేయలేదు. తన అన్న స్నేహాశిష్ గంగూలీ కోసం త్యాగం చేశాడు.

క్యాబ్ అధ్యక్షుడిగా స్నేహాశిష్ గంగూలీ ఎంపిక లాంఛనమే. ఉపాధ్యక్షుడిగా అమలేందు విశ్వాస్, సెక్రటరీగా నరేశ్ ఓఝా, ట్రెజరర్ గా ప్రభీర్ చక్రవర్తి, జాయింట్ సెక్రటరీగా దేబబ్రత దాస్ ఎంపిక కానున్నారు. మరోవైపు గంగూలీ మాట్లాడుతూ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే పోటీ చేయలేదని చెప్పారు. వాళ్లు మూడేళ్లు పాలన చేసిన తర్వాత చూద్దామని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గంగూలీ ఇకపై క్రికెట్ కు దూరంగా గడపాల్సిన పరిస్థితి ఉంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!