అధ్యక్షుడు గొటబాయ పాస్ పోర్టుపై స్టాంప్ వేసేందుకు నిరాకరించిన శ్రీలంక ఇమ్మిగ్రేషన్ సిబ్బంది

దేశం విడిచిపారిపోవాలన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఇమ్మిగ్రేషన్ అధికారులు సహాయ నిరాకరణ చేశారు. గత రాత్రి కొలంబో ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన వీఐపీ లాంజ్ లో ఉండగా, ఆయన వద్దకు వెళ్లి పాస్ పోర్టుపై స్టాంప్ వేసేందుకు ఇమ్మిగ్రేషన్ సిబ్బంది విముఖత వ్యక్తం చేశారు. వీఐపీ లాంజ్ వీడి బయటికి వస్తే ఇతర ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు, విపత్కర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో గొటబాయ అక్కడే ఉండిపోయారు. దాంతో ఆయన విదేశీ ప్రయాణానికి క్లియరెన్స్ లభించలేదు.
రాజపక్స సోదరుడు, మాజీ మంత్రి బసిల్ రాజపక్సను కూడా ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకోవడం తెలిసిందే. బసిల్ విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు రాగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి మంజూరు చేయలేదు. దాంతో ఆయన వెనుదిరిగారు. కాగా, అధ్యక్షుడు గొటబాయ రేపు పదవికి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికీ శ్రీలంక సర్వసైనాధ్యక్షుడు ఆయనే. సాయుధ దళాలపై అధికారం ఆయన చేతుల్లోనే ఉంది.
గగన మార్గం నుంచి తప్పించుకోవడానికి వీల్లేకపోవడంతో, గొటబాయ సముద్రమార్గాన్ని ఆశ్రయిస్తారని, ఓ బోటులో శ్రీలంకను వీడి విదేశాలకు చేరుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.అటు, రాజపక్స సోదరులు, ఇతర ప్రముఖులు దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ లంక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Nationalist Voice

About Author

error: Content is protected !!