అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యం: మోదీ

  • కార్గిల్ లో సైనికులతో దీపావళి జరుపుకున్న ప్రధాన మంత్రి
  • సైనికులను తన కుటుంబం అని సంబోధించిన మోదీ
  • యుద్ధాన్ని భారత్ ఎప్పుడూ చివరి ఎంపికగా పరిగణిస్తుందని వ్యాఖ్య
అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యం అని కార్గిల్‌లో సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అయితే తమ ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని చెప్పారు. గత కొన్నేళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ  ప్రధాని మోదీ ఈ ఉదయం కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. సైనికులను తన కుటుంబం అని సంబోధించిన ప్రధాని  వారు లేకుండా తాను దీపావళిని జరుపుకోలేనని అన్నారు. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. తన దీపావళి తీపి, ప్రకాశం మీ మధ్య ఉంది అని వారితో చెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ‘మేము ఎల్లప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తున్నాము. లంకలో జరిగినా, కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మేము ప్రపంచ శాంతికి అనుకూలంగా ఉన్నాము’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై సైనికుల పోరును కొనియాడుతూ.. వారి ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయని అన్నారు. కార్గిల్‌లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణిచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని అన్నారు. ‘భారతదేశానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది. మీరు మా సరిహద్దులను రక్షిస్తున్నప్పుడు, మేము మా శత్రువులపై కఠినమైన వైఖరిని తీసుకుంటున్నాము. మమ్మల్ని సవాలు చేస్తే, మా సాయుధ దళాలకు వారి స్వంత భాషలో శత్రువులకు ఎలా తగిన సమాధానం ఇవ్వాలో తెలుసు’ మోదీ చెప్పారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  సైనికులతో దీపావళిని జరుపుకుంటున్న ప్రధాని.. త్రివిధ దళాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. సరిహద్దుల్లో పటిష్ట భద్రత, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. గత ఏడు, ఎనిమిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ఐదవ స్థానానికి చేరుకుందని చెప్పారు. ఇక, యుద్ద పీడిత ఉక్రెయిన్‌లో, అక్కడ చిక్కుకున్న పౌరులకు భారత జెండా రక్షణ కవచంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు  ఇక, సాయుధ బలగాలలో మహిళ చేరికపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.‘భారత సైన్యంలోకి మా కుమార్తెల రాకతో మా శక్తి పెరగబోతోంది’ అని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!